‘టీటీడీ అతి పెద్ద వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో చిన్నచిన్న లోపాలు ఉంటాయి.
ఆగమాలకు ఆనుగుణంగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. అంత మాత్రాన భక్తుల
మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం మంచిది కాదు.’ అని రాష్ట్ర దేవదాయ
శాఖ మంత్రి సీ. రామచంద్రయ్య తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీటీడీపై,
తిరుమలపై విమర్శలు చేసేవారు ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. తిరుపతి
పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్లో శనివారం రాత్రి రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి
సి.రామచంద్రయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
దేవాలయ ఆస్తుల పరిరక్షణకు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రజలు, నాయకులు,
న్యాయస్థానాలు సహకరించాలని కోరారు. ప్రస్తుత రాజకీయాల్లో దిగజారుడుతనం
తాండవిస్తోందని విమర్శించారు. అవకాశవాద రాజకీయాలు, వ్యక్తిగత విమర్శలు
ఎక్కువయ్యాయని ఆరోపించారు. ధర్మాన్ని నిలబెట్టే విధంగా, శక్తి వంచన లేకుండా
పనిచేస్తానని తెలిపారు. ప్రజాసేవ కంటే ముందు మాధవసేవ చేయమని ఆ దేవుడే
దేవదాయమంత్రి పదవి ఇప్పించాడని అన్నారు. దేవదాయ మంత్రి పదవి
తీసుకుంటే రాజకీయ భవిష్యత్ ఉండదని అందరూ అన్నారని చెప్పారు. మన పనిని
చిత్తశుద్ధితో చేస్తే అన్నీ మంచే జరుగుతాయని అన్నారు.
No comments:
Post a Comment